source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29state1
ఇంగ్లీషు మింగేసింది!
ిసబిఎస్ఇ పాఠాలు అర్థం కావడంలేదని
గురుకుల విద్యార్ధి ఆత్మహత్య
నర్సంపేట, జూలై 29 (ఆన్లైన్): ఆంగ్ల మాధ్యమ బోధన అర్థంకాక ఆం దోళన చెందుతున్న ఓ గురుకుల విద్యార్థి మంగళవారం పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట మండలకేంద్రంలోని ఆదర్శనగర్కు చెందిన దాసరి వంశీ(10) వల్లభ్నగర్లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిన వంశీ, ఇంటిపై బెంగపెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సిబిఎస్ఇ ఆంగ్ల మాధ్యమ బోధనకు అతను ఇబ్బంది పడ్డాడు.
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచే ప్రారంభమైన ఇంగ్లీషు మీడియం పాఠ్యాంశాలు, తనకు అర్థం కావడం లేదంటూ తమవద్ద వాపోయేవాడని సహచరులు తెలిపారు. తనకీ ఇం గ్లీషు మీడియం వద్దని, తాను ఇంటికి వెళ్లిపోతానని వారితో చెప్పేవాడు. నాలు గు రోజుల క్రితమే అతడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బుజ్జగించి వెళ్లి నట్లు సమాచారం. ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరినా ఉపాధ్యా యులు నిరాకరించారని తోటి విద్యార్థులతో వంశీ చెప్పాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు తోటి విద్యార్థులంతా ప్రార్థనలో నిమ గ్నమై ఉండగా, వంశీ పాఠశాల భవనంపై నుంచి దూకాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వంశీ మృతిచెందాడు. వంశీ మృతి విషయం తెలియగానే విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఎబివిపి నాయకులు పాఠశాలలో బైఠాయించారు. ఘటన వివరాలపై, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తహశీల్దార్ ఇబ్రహీం స్పష్టంచేయడంతో వారు ఆందోళన విరమించారు
5 comments:
పొద్దున పేపర్లో చూడగానే ఈ వార్త నన్ను కదిలించింది.మృతి చెందిన తరువాత ఎన్ని ఆందోళనలు చేస్తే ఏంలాభం.ఇంకా ఎందరు పిల్లలు మూగ వేదన అనుభవిస్తున్నారో కదా!ఎవరికి వారు తమ కోసం పోరాటాలు చేసుకుంటున్నారు. పాపం ఈ పిల్లలే ఏ పోరాటాలు చేయలేక పోతున్నారు.జంతువుల క్షేమం కొరకు కూడా ఉద్యమాలున్నాయి.ఈ పిల్లల గోడు పట్టించుకొనే నాథుడే లేడు.
ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఇదివఱకే ఒకచోట (నా బ్లాగులో కాదు) రాశాను. ఆత్మహత్యలు కాకపోయినా మన రాష్ట్రంలో అమలవుతున్న ఇంగ్లీషు మీడియమ్ మూలంగా drop-outs పెఱిగిపోతారు. ఈ dropping-out బడిదశలోనే అని కాదు, ఏ దశలోనైనా జరగొచ్చు. ఆఖరికి డిగ్రీ పుచ్చుకున్నాక కూడా జరగొచ్చు.
సమాజంలో కొద్దిమందికి ఇంగ్లీషు రావడం వల్ల ఆ కొద్దిమందికీ ఉద్యోగాలొస్తున్నాయి. అందువల్ల ఇంగ్లీషంటే ఏదో ఉద్యోగాలిప్పించే మాధ్యమమనే అపోహ ప్రబలింది. అది వచ్చినవాళ్ళు అలా కొద్దిమంది ఉన్నంతకాలమే దానికి విలువ. అందఱికీ వస్తే దానికి విలువ ఉండదనే సత్యాన్ని గ్రహించలేక ఇంగ్లీషుని బలవంతంగా జనం నెత్తిమీద రుద్దుతున్నారు.
వనర్లూ, నైపుణ్యాలూ, వాటిని విపణించుకునే (marketing) తెలివితేటలూ లేనప్పుడు ఇంగ్లీషైనా ఒకటే, తెలుగైనా ఒకటే !
చాలా బాగుంది.
విధ్యార్ధి మరణించటం విషాదకరమే.
మీ రిచ్చిన సమాచారాన్నే మళ్లా చదవండి. ఎక్కడో ఎదో డిస్టార్షన్ జరుతుతున్నట్లు కనిపించటం లేదు.
1. ఆ పిల్ల గాడు స్కూలులో జాయిన్ అయ్యి 20 అయ్యిందంటున్నారు. ఇరవై రోజులలోగా భోధనా మాధ్యమం యొక్క ప్రభావం అంతగా ఉంటుందంటారా?.
ఎన్ని పరీక్షలు జరిగాయి. ఎన్ని సబ్జక్టులలో ఫైల్ అయ్యాడు.
ఆ పిల్లగాడు మునుపటి ప్రతిభకు, ఇప్పటి వెనుకుబాటు తనానికి మధ్య తేడా ఎలా తెలిసింది. (అదీ 20 రోజులలో)
2. ఇంటిపై బెంగపెట్టుకున్నాడు.:
ఇది ఒక కారణం కావొచ్చు గా. ఈ కారణం గానే విధ్యార్ధిలోకంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నది వాస్తవం కాదా? మరీ ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలలో. దీనికి తోడు వత్తిడి.
3.తనకీ ఇం గ్లీషు మీడియం వద్దని, తాను ఇంటికి వెళ్లిపోతానని వారితో చెప్పేవాడు. మీడియం వద్దనా అసలీ చదువే వద్దనా? ఈ చదువే వద్దని అంటే దాన్ని మీడియం వద్దని వక్రీకరించటం జరుగుతుందా?
3. నాలు గు రోజుల క్రితమే అతడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బుజ్జగించి వెళ్లి నట్లు సమాచారం.:
తల్లితండ్రులు ఎందుకు బుజగించారు? పిల్లవాడిని అక్కడే ఉంచి ఎందుకు చదివించాలనుకున్నారు?
మంచి జరుగుతాదనే ఉద్దేశ్యం తోనే కదా? మరి అలాఅంటప్పుడు, ఆ పిల్లవాని భవిష్యత్తు పట్ల వాళ్ల తల్లితండ్రుల కంటే ఎక్కువ నిబద్దత మీరు చూపించగలరా?
(దురదృష్ట వశాత్తు ఇక్కడ పిల్ల వాడు చనిపోవటం వల్ల నేను ముందే చెప్పాను అంటూ వృద్ద జంబూకాలలా, దీనిని వక్రీకరించి పెద్ద ఇష్యూ చేస్తున్నారు.)
4. ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరినా ఉపాధ్యా యులు నిరాకరించారని తోటి విద్యార్థులతో వంశీ చెప్పాడు.
నిజమే అక్కడి పరిస్థితులేమిటో ఎవరికి తెలుసు? ఇలా నిరాకరించటానికి, ఇంగ్లీషు మీడియం కు సంబంధమేమైనా ఉందా?
ఏ మీడియం అయినా పాఠశాల కు కొన్ని నిబంధనలుంటాయి. దాని ప్రకారం అక్కడి అధికారులు పాటించటంలో తప్పులేదుగా.?
జరిగింది దురదృష్టకర సంఘటన. సందేహంలేదు. కానీ ఇలాంటి సంఘటనలవెనుక మీరు ప్రొజెక్ట్ చేసినంతటి ప్లెయిన్ మోటివ్స్ ఉంటాయని నేను భావించను.
అంతే కాదు చాలా వరకు ఆత్మహత్యల వెనుక పైకి కనిపించే కారణాల కంటే బలమైన సామాజిక/ మానసిక కారణాలుంటాయని నేను నమ్ముతాను.
బొల్లోజు బాబా
Baba garu,
Your analysis is simply superb. It all fits.
Good for people to know.
Post a Comment