Showing posts with label kavita. Show all posts
Showing posts with label kavita. Show all posts

Wednesday, September 10, 2008

నోరు విప్పే వారెవరూ కన్పించలేదు.

ముందు వారు 'బూతు ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది మంచి బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు 'మూఢ ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'అమూఢ ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు ' కుల ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'అభ్యుదయ ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు ' ప్రాంతీయ ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'సమైఖ్య ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


ఇప్పుడు ' నా బ్లాగు ' నే తొలగించారు.

చుట్టూ చూస్తే నోరు విప్పే వారెవరూ కన్పించలేదు.

Tuesday, September 9, 2008

నమ్మలేని నిజాలెన్నో

ఇన్నాళ్లూ మనసు అద్దంలో
నన్ను నేను పరికిస్తూ,
సూపర్ గా ఉన్నా అనుకుంటున్నా!

ఇవ్వాల నిజ అద్దంలో చూస్తుంటే
నమ్మలేని నిజాలెన్నో కన్పిస్తున్నాయి.

తెల్లబడ్డ జుట్టు,
నల్లబడ్డ పెదాలు,
ముడతలు పడ్డ మొఖం,
కళ్ల ముందు బూతద్దాలు
పెద్ద చైనా గంటలా ఒళ్లు!
నిజాలెన్నో కన్పిస్తున్నాయి.

ఇన్నాళ్లూ
ప్రేమ, స్నేహం
కోపం, నవ్వు
మాట, పాట
అన్నీ ఎత్తులే అనుకుంటూ
ప్రయోగిస్తూ విజయాల మెట్లెక్కుతూ
సూపర్ అనుకుంటున్నా.

ఇవ్వాల క్రిందికి చూస్తే
వదిలేసిన చెప్పులూ
విసిరేసిన గొడుగులూ
ఆవల వేసిన వస్త్రాలూ
అందనంత దూరంలో కన్పించాయి.
ఎండా, వానా
కష్టాల్, కష్టాల్
తోడై నిల్చాయి.

రేడియోతో పాడించీ పాడించీ
పొడిబారిపొయిన బ్యాటరీల్లా
ఎవరికోసమో, ఎవరితోనో
ఏదో చేయించి వాడిపొయిన
నిజ రూపం కన్పించింది.

Monday, August 25, 2008

ఎలాగో ఏదో రకంగా ఉంది

పొగచూరిన దీపం వెలుగులా
మబ్బులు కమ్మిన సాయం సంధ్య వేలలా
మనసంగా ఏదో కమ్మేసింది.

చల్లని నీళ్లు నెత్తిపై పోసినట్టు,
చల్లని నీల్లు మొహంపై కుమ్మరించినట్టు
చల్లని నీళ్లలో కాళ్లు పెట్టినట్టు
ఎలాగో ఎదో రకంగా ఉంది

ఎవరో ఇనుప ముక్క గొంతులో దించినట్టు
ఎవరో సన్నని కత్తితో గొంతు దబ్ మని కోసినట్టు
ఎవరో నన్ను నిలువునా చీల్చినట్టు
ఎలాగో ఏదో రకంగా ఉంది

విహారం

మరో ఉదయం మేల్కొని
రెక్కలు అల్లల్లాడిచ్చి, విదిల్చి
కాలితో ముక్కు సరి చేసుకొని
ముక్కుతో కాళ్లు సరిచేసుకొని
అటు ఇటు చూసి విహారం మొదలెట్టాను.

కొంచెం సేపు రెక్కలు వేగంగా అల్లాడిస్తూ
కొంచెంసేపు రెక్కలు నెమ్మదిగా అల్లాడిస్తూ
కొంచెంసేపు రెక్కలు నిశ్చలంగా నిలిపి
అటు ఇటు చూస్తూ విహారం కొనసాగించాను.

కొండల చుట్టూ, జలపాతాల పైగా
నదుల వెంబడి, సముద్రాల అలల పైగా
నగరాలకు దూరంగా, పల్లెల పైగా
అన్నీ ఆనందిస్తూ విహారం కొనసాగించాను.

ఆకలి వేలల వేటాడుతూ,
ఆపై క్షణ క్షణం ఆనందిస్తూ,
విహారం కొనసాగించాను.

Monday, August 18, 2008

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
సున్నా సున్నా అనే నమ్మకం మీదే కదా లోకం నడుస్తుంది!

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
నమ్మకంతో కుంటి వాడు నడవటం నేను చూశాను.
నమ్మకంతో గుడ్డివాడు చూడటం నేను చూశాను.

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?

ఎప్పుడూ ఇప్పుడు నువ్వెవడో వాడివే నీవు.

ఎప్పుడో రాయి మీద రాయి పెట్టి
ఓ శిల్పం పేర్చి ఉండవచ్చు.
ఇప్పుడు నువ్వో శిల్పకారునివనుకుంటే ఎలా?

ఎప్పుడో పలు రంగులు విరజిమ్మి
ఓ అధ్భుతాన్ని ఆవిష్కరించి ఉండవచ్చు.
ఇప్పుడు నువ్వో చిత్రకారునివనుకుంటే ఎలా?

ఎప్పుడో మేరువును ఒంటి చేత్తో
ఒక్క కుదుపు కుదిపి ఉండవచ్చు.
ఇప్పుడు నువ్వో అతి బలవంతుడివనుకుంటే ఎలా?

ఎప్పుడూ ఇప్పుడు నువ్వెవడో వాడివే నీవు.

నల్లని ముసుగు

నల్లని ముసుగు నెత్తి నిండుగా కప్పుకొని
కోనేట్లో నీళ్లు దోసిట్లోకి తీసుకొని
వెనక్కి వేసుకోబోతే,
చేప పిల్లొకటి పరిచయమున్న దానిలా నవ్వింది.

నల్లని ముసుగుని నుదిటి మీదకనుకొని
సాయం సంధ్యలోని మసక వెలుగులో
మాడ వీధిలో నడుస్తుంటే
అమ్మవారి ఏనుగు తలపై ఆశీర్వదించింది, బరువుగా.


నల్లని ముసుగుని కొంచెం క్రిందకని,
వంచిన తల కొంచెం ఎత్తి
స్వామి వారి వైపు చూస్తే
ఎవర్నుండి దాచుకుంటావ్?
అంటూ చిర్వవ్వులు నవ్వాడు.

Tuesday, July 22, 2008

(సశేషం)

ఓ రోజు,
వస్తాయనుకున్న మబ్బులు రాక
చల్లబడ్తాడనుకున్న సూర్యుడు అలాగే మండుతుంటే
అదృష్టవశాత్తూ రోడ్డు పక్కన బతికిపొయిన
గరర్నమెంటు చెట్టు నీడలో సేదతీరుతుంటే
నువ్వు మొదటిసారిగా కన్పించావు.

అంత ఏండలోనూ
నాలుగాకుల నీడ కింద
ఏడుపు లేకుండా నవ్వులేకుండా
నీ లోకంలో నువ్వాడుకుంటున్నావు.

ఎవరైనా వస్తారేమో అని చూసి,
ఎవరూ రాకపొయ్యేసరికి ఆశ్చర్యపొయి
భుజంపై వేసుకోని లాలించి
ఊరంతా తిరిగి చూసి
అందరికీ వివరించి చెప్పి
ఎవరికీ ఏమీ కానివాడవని
నాదగ్గరే ఉంచుకున్నాను.

అడుగులో అడుగు వేస్తూ
పడుతూ లేస్తూ నడుస్తుంటే
ఎంతో మురిసిపొయినాను.
గుండెలమీదుంచుకొని నిద్రోయినాను.

నిన్ను చూపించి సుద్దులు నేర్పుతుంటే,
ఊరంతా తిరిగి గొప్పలు చెప్పుకొని
ఎంతో మురిసి పొయినాను.

(సశేషం)

Saturday, June 28, 2008

రాజ శేఖరన్

రాజన్
రాజాధిరాజన్
మగరాజన్

రాజకీయ దురంధరన్
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్

ఆ అంటే అందలాలు
ఆయ్ అంటే అరదండాలు!
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్

అయినవారికి ఆకాశం, భూమీ!
కానివారికి కషాయం, కాలకూటం!!
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్

పీడకల
చీడపురుగు
ఓడయ్యే బండి
బండయ్యే ఓడ
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్
రాజ శేఖరన్

Monday, June 23, 2008

నక్షత్రాలు నవ్వుతూ నాట్యం చేస్తుంటాయి.

అక్కడ
నక్షత్రాలు నవ్వుతూ నాట్యం చేస్తుంటాయి.

అక్కడ
నవ్వుకు నవ్వు తప్ప మరో అర్థం లేదు.

ఇక్కడ
విషాద మేఘాలు నన్ను చుట్టుముట్టాయి.

ఇక్కడ
ద్వారాలన్నీ మూసి ఉన్నాయి.

ఇక్కడ,
పెదాలకు నవ్వు పూసుకొని నేనున్నాను.

ఇక్కడ,
నక్షత్రాలను లెక్కేస్తూ నేనున్నాను.

ఇక్కడ,
కన్నీరు బయటకు రానీకుండా గుండెలో చెలములు కట్టుకున్నాను.