http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel16.htm
వేలం'వెర్రి కుదిరింది'ఆ రూ.956 కోట్లు చెల్లించలేంఅడ్వాన్సుల మేర భూమివ్వండి చాలుచేతులెత్తేసిన డీఎల్‌ఎఫ్, యూనిటెక్‌కోకాపేట, బుద్వేలులలో భూమ్ ఢామ్‌అప్పుల వూబిలో హైమాహైదరాబాద్ - న్యూస్‌టుడేఅమెరికాలో మొదలై, సునామీలా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌నూ తాకింది. ఎకరం యాభై కోట్లంటూ సినిమాల్లోకీ పాకిన కోకాపేట భూముల భూమ్ ఫట్ మంది. వందల కోట్ల రూపాయలు చిల్ల పెంకుల్లా వెదజల్లి, నగర శివార్లలో ఎకరాల కొద్దీ భూములు బుక్ చేసుకున్న డీఎల్‌ఎఫ్, యూనిటెక్ సంస్థలు మిగతా రూ.956 కోట్లు చెల్లించాల్సి వచ్చే సరికి చేతులెత్తేశాయి. ఇటీవల సంక్షోభంలో వాటి షేర్లు పాతాళానికి చేరి, మళ్లీ పుంజుకోకపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. దాంతో తాము చెల్లించిన అడ్వాన్సులకు ఎంత భూమి వస్తే అంతే ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాళ్ల బేరానికి వచ్చాయి. నిరుపేదల నుంచి భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హైమా)కు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. హైమాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది భూమి అమ్మకాల లక్ష్యం రూ.4 వేల కోట్లు నిర్దేశించింది. భారీ లక్ష్యాన్ని చేరుకోలేక పోయిన హైమా బంగారం పండించే భూములున్నాయిలే అన్న ధైర్యంతో బ్యాంకుల నుంచి రూ.500 కోట్లు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టడమే పెద్ద సమస్యగా మారింది. భూముల ధరలు తగ్గించ లేని పరిస్థితుల్లో వేచి ఉండటం తప్ప దానికి మరో మార్గంలేదు.
డీఎల్‌ఎఫ్: అంతర్జాతీయ విమానాశ్రయానికి, సైబరాబాద్‌కు దగ్గర్లో అవుటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న కోకాపేటలో హుడా(తర్వాత హైమాగా మారింది) 'గోల్డెన్ మైల్' పేరిట 100 ఎకరాలను గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం వేలం వేసింది. ఎకరం రూ.10 కోట్లు నిర్ణయించగా 25 ఎకరాలు అమ్ముడుపోయాయి. మిగిలిన 75 ఎకరాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు కేటాయించింది. ఆ సంస్థ రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉండగా బయానా కింద రూ.385 కోట్లు చెల్లించింది. పన్నులు కలుపుకుని డీఎల్‌ఎఫ్ ఇంకా రూ.480 కోట్లు చెల్లించాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాంద్యం ఏర్పడటంతో ఆ సంస్థ వెనక్కితగ్గింది. మూడు నెలల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా, పది నెలలు గడిచినా మిగతా మొత్తం చెల్లించలేదు. అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే చివరి నోటీసు జారీ చేశారు. మిగతా మొత్తం చెల్లించకపోతే కేటాయింపు రద్దు చేస్తామని, అడ్వాన్సుగా ఇచ్చింది తిరిగి ఇచ్చేది లేదని హెచ్చరించింది. దాంతో డీఎల్‌ఎఫ్ కదిలివచ్చింది. అడ్వాన్సు మొత్తానికి ఎంత భూమి వస్తుందో అంతే భూమిని తనకివ్వాలని మొరపెట్టుకుంది.
యూనిటెక్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టార్ హోటళ్ల అవసరం ఉందని భావించిన ప్రభుత్వం సమీపంలోని బుద్వేలులో పర్యాటక సంస్థ నుంచి 80 ఎకరాలను, నిరుపేద రైతుల నుంచి అసైన్డ్ భూమి మరో 90 ఎకరాలను సేకరించింది. హుడాకు అప్పగించింది. ఇందులో 164 ఎకరాలు హుడా వేలం వేసింది. యూనిటెక్ సంస్థ ఎకరం రూ.4.01 కోట్ల చొప్పున దక్కించుకుంది. అడ్వాన్సుగా రూ.180 కోట్లు చెల్లించింది. ఒప్పందం ప్రకారం మిగిలిన రూ.476 కోట్లు మూడు వాయిదాల్లో చెల్లించాలి. ఇటీవల రియల్ ఎస్టేట్ పతనంలో భాగంగా ఆ సంస్థ షేర్లు బాగా పడిపోయాయి. దాంతో ఆ సంస్థకూ నిధుల లభ్యత సమస్య ఏర్పడింది. పలుమార్లు అధికారులు సంప్రదింపులు జరిపినా ఆ సంస్థ బుద్వేలు భూముల బాకీ చెల్లించలేక పోయింది. చివరకు ఈ సంస్థ కూడా రూ.180 కోట్లకు ఎంత భూమి వస్తుందో అంతే తమకు ఇవ్వాలని మొర పెట్టుకుంది. కార్పొరేట్ సంస్థలు భారీ ధరలు పెట్టి హైదరాబాద్‌లో భూములు కొనడంతోనే రాజధానిలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటాయి. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ పాపంలో సామాజిక బాధ్యతను మరచి తగని పోటీని సృష్టించిన హైమాదే ప్రధాన పాత్ర. ఇప్పుడీ సంస్థలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. మరి రేట్లు దిగిరాలేదేం? అనేది సామాన్యుడి ప్రశ్న. మిగతా రియల్ సంస్థలూ కొన్న రేటుకన్నా తక్కువకు అమ్మలేక పళ్ల బిగువున ఆపడమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది
No comments:
Post a Comment