Wednesday, October 1, 2008

మంచి దొంగ

రాయల వారి ఆద్వర్యంలో హంపిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అప్పటికే రాయలు వారు దున్నపోతును ఒక్కేటున బలిచ్చి సామంతుల నుండి బహుమతులు స్వీకరించడం వంటి కార్యక్రమాలు ముగించి నాట్యవినోదంలో మునిగిపొయ్యారు. నగరం మొత్తం అక్కడే ఉందా అన్పించేట్టు ఇసుక వేస్తే రాలనంతమంది పోగయ్యారు. సరిగ్గా అదే సమయంలో నగరంలో రెండు ప్రముఖ శెట్టిగార్ల భవనాలు దోపిడీకి గురయ్యాయన్న వార్త దానావాలంలా వ్యాపించింది. హంపి నగరంలో దొంగతనమా! అదీ ఒకే రోజు రెండు చోట్ల !! అంతా ముక్కున వేలేసుకున్నారు.
%%%%%%%%%%
అంతకు రెండు దినాల క్రితం దొంగల గుహ చాలా కోలాహలంగా ఉంది. ఆ రోజు దొంగల నాయకునికి వారసుని ఎన్నుకునే రోజు. అప్పటి వరకు జరిగిన అన్ని పోటీల్లోనూ కిన్నడు, తిన్నడు సమ ఉజ్జీలుగా వచ్చారు. తమ నాయకుడు ఎవరిని విజేతగా ప్రకటిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు.
దొంగల నాయకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో అప్పటివరకు కోలాహలంగా ఉన్న గుహ చాలా నిశ్శబ్దంగా మారిపొయింది.
"నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని పోటీల్లోనూ కిన్నడు, తిన్నడు ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారు. అందుకని ఇంకో పోటీ --" అందరూ మరింత కుతూహలంగా వినసాగారు, తరువాతి పోటీ ఏమిటా అని.
"ఇదిగో ఇది హంపీ నగరంలో విరూపాక్షునికి శెట్టిగార్ల వీధి సమర్పించిన దాన వివరాల దస్త్రం. వీరిలో ఏదో ఒక ఇంటికి వెళ్లి సొమ్ములతో తిరిగి రావాలి."
%%%%%%%%%%%%%%%%%%%%
దసరా పండుగ ముగిసింది. దొంగల గుహ ఈ రోజు మరింత కోలాహలంగా ఉంది. అంతలో తిన్నడు తను తీసుకొచ్చిన బంగారు వరహాలు, నగలు, వజ్రాలు అన్నీ నాయకుని ఎదురుగా కుప్ప పోశాడు. గుహ మొత్తం సంతోషసూచకంగా ధ్వనులు. "విరూపాక్షునికి వెయ్యినొక్క వరహాలిచ్చిన గాజుల శెట్టి గారి బొక్కసం ఖాలీ!" అంటూ గర్వంగా నాయకునివైపు చూశాడు. నాయకుడు సంతోషంగా తలూపి కిన్నెడువైపు చూశాడు.
కిన్నెడు సైగ చెయ్యంగనే 16 మంది అనుచరులు బంగారు వరహాలు, వజ్రాలు, ఆభరణాలు పేద్ద గుట్టగా పోసారు. గుహ మొత్తం దద్దరిల్లింది.
"విరూపాక్షునికి ఒకే ఒక్క వరహా దానమిచ్చిన వరాల శెట్టి గారి బొక్కసం ఖాలీ!" అంటూ గర్వంగా నాయకునివైపు చూశాడు.
నాయకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. గుహలో మరోసారి నిశబ్దం ఆవరించింది.
"దొంగల నాయకునికి దొంగతనం చేసే జాగురూకతతో పాటు, ఎక్కడ సొమ్ములుంటాయో తెలుసుకునే తెలివితేటలు కూడా అవసరం. దొంగతనం చెయ్యడంలో తిన్నెడు, కిన్నెడూ ఇద్దరూ ఒకరికి మించిన వారు ఒకరు. కానీ కిన్నెడుకి ఎక్కడ దొంగతనం చెయ్యాలో కూడా తెలుసు. అతనే మీ నాయకుడు." అని ప్రకటించగానే గుహ మరోసారి దద్దరిల్లింది.

3 comments:

రాధిక said...

ఓహో దొంగలు కూడా తెలివయినవాళ్ళు అయివుండాలన్న మాట.గుడ్.

సుజ్జి said...

sare gaani, title set avvaledemo..? "telivina donga" may be correct ??!!

Anonymous said...

రాధిక,

నెనర్లు.

సుజ్జి,

అవును "మంచి దొంగ" మంచిగ సూట్ అవలే, కాపోతే దొంగలకు మంచి దొంగ అనే అర్థంలో వాడాను. ఎలాగూ ఏదో సినిమా ఉంది కదా క్యాచీగా కూడా ఉంటుందని :)

-- yategy