source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29state1
ఇంగ్లీషు మింగేసింది!
ిసబిఎస్‌ఇ పాఠాలు అర్థం కావడంలేదని
గురుకుల విద్యార్ధి ఆత్మహత్య
నర్సంపేట, జూలై 29 (ఆన్‌లైన్): ఆంగ్ల మాధ్యమ బోధన అర్థంకాక ఆం దోళన చెందుతున్న ఓ గురుకుల విద్యార్థి మంగళవారం పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట మండలకేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన దాసరి వంశీ(10) వల్లభ్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిన వంశీ, ఇంటిపై బెంగపెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ ఆంగ్ల మాధ్యమ బోధనకు అతను ఇబ్బంది పడ్డాడు.
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచే ప్రారంభమైన ఇంగ్లీషు మీడియం పాఠ్యాంశాలు, తనకు అర్థం కావడం లేదంటూ తమవద్ద వాపోయేవాడని సహచరులు తెలిపారు. తనకీ ఇం గ్లీషు మీడియం వద్దని, తాను ఇంటికి వెళ్లిపోతానని వారితో చెప్పేవాడు. నాలు గు రోజుల క్రితమే అతడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బుజ్జగించి వెళ్లి నట్లు సమాచారం. ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరినా ఉపాధ్యా యులు నిరాకరించారని తోటి విద్యార్థులతో వంశీ చెప్పాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు తోటి విద్యార్థులంతా ప్రార్థనలో నిమ గ్నమై ఉండగా, వంశీ పాఠశాల భవనంపై నుంచి దూకాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వంశీ మృతిచెందాడు. వంశీ మృతి విషయం తెలియగానే విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎబివిపి నాయకులు పాఠశాలలో బైఠాయించారు. ఘటన వివరాలపై, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తహశీల్దార్ ఇబ్రహీం స్పష్టంచేయడంతో వారు ఆందోళన విరమించారు